యాదాద్రికి కార్తీక శోభ..దర్శనానికి 4 గంటల సమయం

యాదగిరిగుట్ట, వెలుగు:  కార్తీక మాసం చివరి వారం కావడంతో శనివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కూడా కావడంతో  హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు  తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి.  శివాలయం, కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు  కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. కల్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు రద్దీగా మారాయి. దీంతో స్వామివారి దర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది.  శనివారం 3,800 మంది స్పెషల్​,  821 మంది బ్రేక్ దర్శనం చేసుకున్నారు.    యాదగిరిగుట్ట  కార్తీకశోభ సంతరించుకుంది.  భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి కొండపైన ప్రధానాలయ ప్రాంగణం, శివాలయం, విష్ణుపుష్కరిణి, కొండ కింద వ్రత మండపం, లక్ష్మీపుష్కరిణి వద్ద  దీపారాధన స్టాళ్లు ఏర్పాటు చేశారు.  భక్తులు కుటుంబసమేతంగా   కార్తీక దీపాలు వెలిగించి  మొక్కులు తీర్చుకున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పర్వత వర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శివకేశవులకు  రుద్రాభిషేకం, లక్షబిళ్వార్చన పూజలు చేయించారు.   స్పటిక లింగానికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.  

భారీగా వ్రతాల నిర్వహణ

కార్తీకమాసం ముగుస్తుండడంతో  భారీ సంఖ్యలో  సత్యనారాయణస్వామి వ్రతాలు జరిపించారు.  అన్నవరం తర్వాత యాదగిరిగుట్టలోనే  సత్యనారాయణస్వామి వ్రతాలు 
ఎక్కువగా జరుగుతాయి.  వ్రత టికెట్ల కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వెయిట్ చేయాల్సివచ్చింది. రద్దీ ఉండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరు బ్యాచుల్లో  1,579 మంది దంపతులు వ్రతాలు  చేసుకున్నారు.  వ్రత పూజల ద్వారా ఆలయానికి రూ.12,63,900 ఆదాయం వచ్చింది.

ఖజానాకు రూ. 54.85 లక్షల ఆదాయం

కార్తీకమాసం సందర్భంగా పలురకాల పూజల ద్వారా శనివారం ఆలయ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. పలురకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా శనివారం  రూ.54,85,058 ఇన్ కమ్ వచ్చింది.   ప్రసాదాల  విక్రయం ద్వారా రూ.17 లక్షలు,   వ్రతాల నిర్వహణ ద్వారా రూ.12లక్షల 63 వేలు,  దర్శన టికెట్ల ద్వారా  రూ.5.70 లక్షలు, కొండపైకి వచ్చిన వాహనాల ద్వారా  రూ.5.50 లక్షలు, ప్రధాన బుకింగ్ తో రూ.3. 14 లక్షలు,  బ్రేక్ దర్శనాల ద్వారా రూ.2.46 లక్షలు  ఇన్ కమ్ వచ్చిందని ఆలయ ఆఫీసర్లు తెలిపారు.