తిరుగువారానికి తరలొచ్చిన సమ్మక్క, సారలమ్మ భక్తులు

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుగువారం సందర్భంగా భారీగా తరలివచ్చారు. ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. ఎత్తు బంగారం, పసుపు, కుంకుమ, చీరసారేతో వనదేవతల గద్దెల వద్దకు చేరుకుని సమర్పించారు. అనంతరం వారి వెంట తెచ్చుకున్న కోళ్లను, యాటలను దేవతలకు ఎదిరించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు ముందుస్తు ఏర్పాట్లు చేశారు. గద్దెల వద్ద పోలీసులు భారీ బందోబస్త్​నిర్వహించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు సమ్మక్క, సారలమ్మ మహాజాతర  అంగరంగ వైభవంగా జరగగా, కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు.

తిరుగువారం  సందర్భంగా కన్నేపల్లిలో సారలమ్మ పూజారులు, మేడారంలో సమ్మక్క పూజారులు ఆలయాలతోపాటు ఇండ్లను శుభ్రం చేసుకున్నారు. నెల రోజులుగా పూజల కోసం వాడిన సామగ్రిని శుభ్రం చేశారు. అనంతరం వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల రోజుల నుంచి చేసిన పూజల్లో  ఏమన్నా తప్పులు ఉంటే క్షమించు తల్లి అని వేడుకున్నామని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, కన్నెపల్లిలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య తెలిపారు. తిరుగువారం సందర్భంగా మంత్రి సీతక్క మేడారంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కుకున్నారు.