భద్రాచలం, వెలుగు : భద్రాద్రి రాముల వారికి భక్తులు ఇచ్చే విరాళాలు గోల్మాల్అయ్యాయి. భక్తులు వచ్చి ఉద్యోగులను నిలదీయడంత విషయం బయటకు వచ్చింది. దీంతో బుధవారం తీసుకున్న డబ్బులను ఉద్యోగులు తిరిగి చెల్లించినట్లు తెలుస్తోంది. కరోనాకు ముందు ఓ ట్రస్టు భద్రాచలం రాములవారికి కాటేజీ నిర్మిస్తామని వచ్చింది. తమ ట్రస్టు తరపున విరాళాలు వసూలు చేసి కట్టిస్తామని వచ్చినా ఇంజనీరింగ్ విభాగం తిరస్కరించింది. దీంతో వారు ఆలోచనను విరమించుకున్నారు.
కానీ, తమ పేరిట గది కట్టించాలంటూ వారు దేవస్థానం ఉద్యోగులకు రూ.18లక్షల వరకు ఇచ్చారు. అయితే వారి పేరిట ఇక్కడ ఎటువంటి కాటేజీ లేకపోవడంతో ఉద్యోగులను నిలదీశారు. రెండు నెలల క్రితం దేవస్థానానికి ఫోన్ చేసి విషయం చెప్పారు కానీ, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. తాజాగా బుధవారం భద్రాచలం వచ్చి తమ వద్ద విరాళం తీసుకున్న ఉద్యోగులను నిలదీయడంతో అప్పటికప్పుడు రూ.11లక్షలు చెల్లించారని తెలిసింది. అయితే ఆ నోటా ఈ నోటా పడి విషయం వెలుగులోకి రావడంతో ఈవో రమాదేవిని సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. కానీ, కొంత కాలం కింద ఫోన్ ద్వారా విషయం తన దృష్టికి తెచ్చారని వెల్లడించారు.