జగిత్యాల జిల్లా : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అధికార పార్టీ నాయకులు కొండగట్టుకు వెళ్లిన సందర్భంగా దర్శనాలను నిలిపివేయడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. కొండగట్టు అంజన్న స్వామిని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తో పాటు మంత్రులు గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలతో పాటు సీఎస్ శాంతకుమారి, జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష దర్శనం చేసుకున్నారు. దాదాపు మూడు గంటలపాటు ఆలయ అధికారులు దర్శనాలను నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
ALSO READ :ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్
ఎంపీ సంతోష్ కుమార్ పర్యటన సందర్భంగా ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను పార్కింగ్ చేయించారు. దీంతో పిల్లలు, వృద్ధులు నడుచుకుంటూ కొండగట్టు అంజన్న వద్దకు చేరుకున్నారు. దాదాపు మూడు గంటలు దర్శనాలు నిలిపివేయడంతో చాలామంది భక్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, వరంగల్ వంటి దూర ప్రాంతాల నుంచి దర్శనం కోసం వస్తే వీఐపీల కోసం తమను ఇబ్బంది పెడుతారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.