- 20 వేలకు మించి భక్తుల రాక
- పెద్ద జయంతి నేపథ్యంలో బుధవారం నుంచి ఆర్జిత సేవలు రద్దు
కొండగట్టు, వెలుగు: కొండగట్టులో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం కావడం, హనుమాన్ పెద్ద జయంతి సమీపిస్తుండడంతో భక్తుల రాక భారీగా పెరిగింది. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ఆలయాన్ని తెరిచే అధికారులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉదయం నాలుగున్నరకే ఓపెన్ చేశారు. మంగళవారం ఒక్కరోజే సుమారు 20వేలకు మించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులు పోటెత్తడంతో స్థానిక వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హనుమాన్ పెద్ద జయంతిని దృష్టిలో ఉంచుకొని బుధవారం నుంచి ఆర్జిత సేవలు, వాహన పూజలు రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. వచ్చే రెండో తేదీ నుంచి తిరిగి యథావిధిగా సేవలు
కొనసాగుతాయన్నారు.