
కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జై శ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో ఆలయం మారుమోగింది. దీక్ష తీసుకున్న వేలాది మంది స్వాములు శనివారం కొండగట్టుకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. శనివారం తెల్లవారుజాము నుంచే మాల విరమణ చేసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 50 వేల మంది అంజన్న స్వాములు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.
ఉత్సవాల సందర్భంగా మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం చేసి పట్టువస్త్రాలతో అలంకరించి, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంజన్నను పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు.