- సంక్రాంతి సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తులు
- క్యూలైన్ల నుంచి దర్శనానికి అనుమతి
- పోలీసుల భారీ బందోబస్తు
మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చి ముందస్తు మొక్కులు అప్పజెప్పారు. దీంతో దేవతల గద్దెలు, జంపన్న వాగు, మేడారం చుట్టుపక్కల వనం జనంతో కిటకిటలాడాయి.
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చి ముందస్తు మొక్కులు అప్పజెప్పారు. దీంతో మేడారం ప్రాంగణం దేవతల గద్దెలు, జంపన్న వాగు, దుకాణాలు, మేడారం చుట్టుపక్కల వనం జనంతో కిటకిటలాడాయి. కొద్దిరోజుల్లో మహాజాతర మొదలైతే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంటుందని, చాలామంది ముందస్తుగానే మేడారం వచ్చి మొక్కులు అప్పజెప్పి పోతున్నారు.
సంక్రాంతి పండుగకు సెలవులు రావడంతో ఉద్యోగులు, స్టూడెంట్స్, వ్యాపారస్తులు పిల్లాపాపలతో వచ్చి దేవతలను దర్శించుకున్నారు. ఆదివారం రద్దీ ఎక్కువ కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుడి ముఖద్వారం నుంచి కాకుండా క్యూ లైన్లలో భక్తులను పంపించారు. గద్దెల వద్ద కూడా రద్దీ పెరిగింది. భక్తులు భారీగా తరలివస్తుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని ఐటీడీఏ పీవో అంకిత్ అధికారులను ఆదేశించారు.