వనదేవతల దర్శనం.. పులకించిన భక్తజనం

  • గద్దెపైకి చేరిన సమ్మక్క
  • శివసత్తుల పూనకాలతో ఊగిపోయిన జాతర్లు
  • భారీగా తరలివచ్చిన భక్తులు

కోల్​లెల్ట్/మంచిర్యాల/నస్పూర్/తిర్యాణి, వెలుగు: సమ్మక్క–సారలమ్మ జాతరలకు భక్తులు పోటెత్తారు. వనదేవతలు గద్దెలపై కొలువుదీరడంతో మంచిర్యాలతోపాటు సింగరేణి ప్రాంతాల్లోని రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ జాతరల్లో గురువారం సాయంత్రం నుంచి మొక్కులు ప్రారంభమయ్యాయి. రామకృష్ణాపూర్ పాలవాగు ఒడ్డున జరుగుతున్న జాతరలో గురువారం సాయంత్రం పొద్దుపోయాక సమ్మక్క తల్లి గద్దెలపైకి రావడంతో భక్తులు పులకించిపోయారు. మందమర్రిలోని దూలం కనుకయ్య గౌడ్ ఇంటి నుంచి అమ్మవారిని ఆర్కే1ఏ గని సమీపంలోని పోచమ్మ తల్లి ఆలయం వద్దకు తీసుకువచ్చారు.

మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ విప్ నల్లాల ఓదెలు దంపతులు, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎం.మనోహర్-సవిత దంపతులు, జాతర చైర్మన్ తదితరులు పూజలు చేశారు. కోయ పూజారులతో కలిసి సమ్మక్క తల్లిని శోభాయాత్రగా గద్దెలపై ప్రతిష్ఠించారు. భక్తులు వనదేవతలను దర్శించుకొని ఒడిబియ్యం సమర్పించారు. అమ్మవార్లను కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ డైరెక్టర్ కె.కరుణ్, సింగరేణి కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ జీఎం గణపతి, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం మనోహర్ తదితరులు దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు. 

శ్రీరాంపూర్ ఏరియాలో..

శ్రీరాంపూర్ ఏరియాలోని సీసీసీ నస్పూర్ ముక్కిడి పోచమ్మ ఆలయ ఆవరణలోని జాతరలో సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరింది.  సింగరేణి హైస్కూల్ ప్రాంతంలోని అటవీప్రాంతం నుంచి అమ్మవార్లను డప్పు చప్పుళ్ల మధ్య కోయపూజారులు, శ్రీరాంపూర్ సింగరేణి జీఎం బి.సంజీవరెడ్డి-రాధాకుమారి దంపతులు, ఎస్ఓటుజీఎం రఘుకుమార్, డీజీఎం పర్సనల్ అరవిందరావు తదితరులు జాతర జరిగే గద్దెల వద్దకు తీసుకవచ్చి గిరిజన సంప్రదాయపద్ధతిలో ప్రతిష్ఠించారు.

మంచిర్యాలలో..

మంచిర్యాల జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతరలకు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం మంచిర్యాల గోదావరి తీరం జనసంద్రంగా మారింది. సాయంత్రం సమ్మక్క గద్దెకు చేరుకుంది. గద్దెలపై కొలువైన తమ ఇలవేల్పులకు భక్తులు ఎదుర్కోళ్లు పలికి ఎత్తు బంగారం సమర్పించారు. కోళ్లు, యాటలను బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. తిర్యాణి మండలంలోని అరటిపల్లి అటవీ ప్రాంతంలోనూ జాతర ఘనంగా సాగింది.