వసంత పంచమి ఎఫెక్ట్.. మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

వసంత పంచమి ఎఫెక్ట్.. మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

మహాకుంభనగర్ (యూపీ): ప్రయాగ్​రాజ్‎లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం వసంత పంచమి కావడంతో భారీ సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు తరలివస్తున్నారు. ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తోపులాటలు, అగ్ని ప్రమాదాలు, తొక్కిసలాటలకు ఆస్కారం ఇవ్వొద్దన్నారు. ‘జీరో ఎర్రర్’తో వసంత పంచమి పుణ్య స్నానాల ఘట్టం ముగించాలని సూచించారు. 

2019లో అర్ధ కుంభమేళాను సక్సెస్​చేసిన టీమ్‎లోని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులైన ఆశీష్ గోయల్, భానుచంద్ర గోస్వామిని ప్రభుత్వం మహాకుంభనగర్‎కు పంపింది. అక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించింది. కాగా, 21 రోజుల్లో సుమారు 35 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు కోటి మంది స్నానాలు చేయగా.. రాత్రి వరకు ఈ సంఖ్య సుమారు 1.50 కోట్లకు చేరిందని అధికారులు తెలిపారు. మేళాలో రద్దీని కంట్రోల్ చేసే బాధ్యతను అడిషనల్ డీజీపీ భాను భాస్కర్ పర్యవేక్షిస్తున్నారు.

నేడు 4 నుంచి 6 కోట్ల మంది వచ్చే చాన్స్

వసంత పంచమి పురస్కరించుకొని సోమవారం 4 నుంచి 6కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కుంభమేళాకు ప్రముఖుల తాకిడి కూడా పెరుగుతున్నది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ప్రయాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌కు వచ్చివెళ్లగా.. ఈ నెల 5న ప్రధాని మోదీ రాక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, భక్తులను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. 

అందరూ ఒకే చోట స్నానాలకు ఎగబడొద్దని మైక్‎లో సూచిస్తున్నారు. పుణ్య స్నానం చేసిన వెంటనే ఘాట్‎ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్తున్నారు. కాళీ మార్గ్, ఆనకట్ట, సంగమం వైపు వెళ్లే రహదారుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. డ్రోన్ల సహాయంతో రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వసంత పంచమి నాడు ఎవరూ కూడా బారికేడ్లను బద్దలు కొట్టకుండా చూసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బారికేడ్లు దాటొద్దని పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

భారీగా తగ్గిన రూమ్ బుకింగ్స్

ఇటీవల జరిగిన తొక్కిసలాట తర్వాత హోటల్స్ బుకింగ్స్ ఒక్కసారిగా పడిపోయాయని నిర్వాహకులు చెప్తున్నారు. వసంత పంచమి తర్వాతి నుంచి బుకింగ్స్ పెరిగే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూమ్స్ బుక్ చేసుకున్న భక్తులు.. ట్రాఫిక్, రద్దీ కారణంగా అనుకున్న టైమ్‎కు చెకిన్ కావడం లేదని, దీంతో బుకింగ్స్ భారీగా పడిపోయాయని ప్రయాగ్​రాజ్ హోటల్ అండ్ రెస్టారెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సర్దార్ హర్జీత్ సింగ్ తెలిపారు.

తొక్కిసలాట ఘటన​పై సుప్రీంలో విచారణ

జనవరి 29న జరిగిన తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు రానున్నది. ఈ పిటిషన్‎ను సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ విచారించనున్నారు. తొక్కిసలాట ఘటనలు రిపీట్ కాకుండా యూపీ ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ సీనియర్​అడ్వకేట్ విశాల్ తివారి పిటిషన్ దాఖలు చేశాడు.