
- నాలుగో రోజూ అదే జోరు..
- కేసారానికి తరలిన దేవరపెట్టె
- నెలవారంతో అధికారికంగా ముగిసిన జాతర
సూర్యాపేట వెలుగు : పెద్దగట్టు జాతరకు భక్తులు పోటెత్తారు. నాలుగోరోజైన బుధవారం సైతం భక్తులు భారీగా తరలివచ్చి లింగమంతుస్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద యాదవ పూజారులు గంధ దీపం ఎత్తి నెలవారం చేశారు. పాలు పొంగించి లింగమంతులస్వామి, చౌడమ్మ, పోతరాజులకు నైవేద్యం సమర్పించారు. అనంతరం చంద్రపట్నం ఎత్తి పసుపు, కుంకుమను పుట్టలో పోశారు. దేవరపెట్టెను తిరిగి కేసారం తరలించారు. నేడు మకర తోరణం తొలగింపుతో జాతర ముగియనుంది. సోమ, మంగళవారాల్లో సుమారుగా 5 లక్షల మంది భక్తులు హాజరు కాగా, బుధవారం 4 లక్షలకు పైగా భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు.
నేటితో ముగియనున్న జాతర..
నాలుగు రోజులపాటు భక్తజన సందోహంతో కళకళలాడిన పెద్దగట్టు జాతర నేటితో ముగియనుంది. ఆచారం ప్రకారం గుట్టపై లింగమంతుల, చౌడమ్మ అమ్మవార్ల ఆలయానికి అమర్చిన మకర తోరణం తొలగింపుతో జాతర ముగిసినట్టే. అనంతరం మకర తోరణాన్ని సూర్యాపేటకు తీసుకొస్తారు.