యాదాద్రి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఓ వైపు ఆదివారం.. మరోవైపు కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. కొండ కింద పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివాలయం వీధుల్లో కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉదయం నుంచి ఉచిత దర్శన క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
ఇక వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం పైగా సెలవురోజు కావడంతో రాజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతోంది. క్యూ లైన్ లో నిలబడి స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆలయ ప్రధాన ముఖ ద్వారం వద్ద కార్తీక ద్వీపాలు వెలిగిస్తున్నారు.