ఘనంగా వేలాల జాతర..మల్లన్నను దర్శించుకున్న లక్షమంది భక్తులు

ఘనంగా వేలాల జాతర..మల్లన్నను దర్శించుకున్న లక్షమంది భక్తులు

జైపూర్, వెలుగు: జైపూర్​ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేలాల గట్టు మల్లన్న మహాశివరాత్రి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజామున నుంచి గట్టు మల్లన్న స్వామి, వేలాల గ్రామంలోని మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో స్వామివారి దర్శనానికి దాదాపు నాలుగు గంటల టైమ్​పట్టింది. భక్తిశ్రద్ధలతో మల్లికార్జునస్వామిని కొలిచి ఉపవాస దీక్షలు ఆచరించారు. ఉపవాసాలతో బోనాలు పోసి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఉదయం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి–-సరోజ దంపతులు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రామగుండం సీపీ శ్రీనివాస్​, మంచిర్యాల డీసీపీ భాస్కర్​ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పోతరాజుల, లక్ష్మిదేవరల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మొదటి రోజు సుమారు లక్షకు పైగా మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారని ఆలయ ఈఓ రమేశ్​తెలిపారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ అధ్వర్యంలో  శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్​ సహా 20 మంది సీఐలు, 600 మంది  పోలీసులు బందోబస్తు నిర్వహించారు.