రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో రాజన్న క్షేత్రం కిటకిటలాడుతోంది. ‘‘ హర హర మహా దేవ.. శంభో శంకర..’’ శివ నామ స్మరణలతో రాజన్న క్షేత్రం పరిసరాలు మార్మోగుతున్నాయి.
తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరారు. దీంతో క్యూలైన్ కిటకిటలాడుతోంది. స్వామి వారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ఆలయం ముందున్న రావిచెట్టు దగ్గర భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. కోడే మొక్కులు చెల్లించి స్వామివారికి అభిషేకములు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు భక్తులు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.
భక్తులతో కిక్కిరిసిన కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం
మేడ్చల్ జిల్లా: కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలు భక్తులతో కిక్కిరిపోతున్నాయి. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు.