వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు పోటెత్తారు. 2024 మార్చి 24న ఆదివారం సెలవు రోజు, హోలీ పండుగ సందర్భంగా వరుస సెలవు కావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు అన్ని నిండిపోయాయి. దీంతో స్వామి వారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. కోడె మొక్కుల కోసం భక్తులు బారులు తీరారు.  

చిన్న పిల్లలు, వృద్దులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండాకాలం కావడంతో క్యూ లైన్లలో నిలబడిన భక్తులకు మంచినీరు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వరుస సెలవులు రావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు.