- ఉమ్మడి జిల్లాలో కిటకిటలాడుతున్న జాతరలు
కరీంనగర్/ కొత్తపల్లి/గొల్లపల్లి, వెలుగు: కరీంనగర్ జిల్లాలో సమ్మక్క, సారలమ్మ జాతరలు జరుగుతున్న గ్రామాల్లో భక్తులు శిగాలూగుతున్నారు. కరీంనగర్ సిటీలోని రేకుర్తితోపాటు కేశవపట్నం, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, హుజురాబాద్, గన్నేరువరం, మైలారం, మానకొండూరు, దేవంపల్లి, కొండపతుల గ్రామాల్లో గురువారం రాత్రి కోయ పూజారులు సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చారు.
గిరిజన సంప్రదాయాలు డోలు, వాయిద్యాలతో ఊరేగింపుగా కాలినడకన తీసుకొచ్చి సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించారు. భక్తులు సమ్మక్క-,సారలమ్మ దేవతల గద్దెల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఒడి బియ్యం, నిలువెత్తు బంగారం సమర్పించారు. కోళ్లు, మేకలు బలి ఇచ్చి కుటుంబ సమేతంగా అక్కడే వంట చేసుకున్నారు. శంకరపట్నం ఎంపీడీఓ ఆఫీసు సమీపంలో నిర్వహిస్తున్న జాతరకు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు గ్రామంలోని ఎక్కల్‌దేవి జాతరలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
జనసంద్రం.. గోదావరితీరం
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని గోదావరి నది బ్రిడ్జి వద్ద జరుగుతున్న సమ్మక్క–సారలమ్మ జాతర గురువారం జనసంద్రమైంది. శివసత్తుల పూనకాలు, పిల్లాపాపలతో నిలువెత్తు బంగారంతో గిరిజన తల్లులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరిఖనితో పాటు ఎన్టీపీసీ, యైటింక్లయిన్‌కాలనీ, మంచిర్యాల, చెన్నూర్, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, తదితర ప్రాంతాల నుంచి భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరిగి గోదావరినది తీరం భక్తజన గుడారంగా మారింది.
సమ్మక్క, సారలమ్మలకు ఇష్టమైన కంకవనాన్ని గురువారం ఉదయం 11 గంటలకు కోయ పూజారులు ప్రత్యేక పూజలు చేసి తీసుకువచ్చి సమ్మక్క గద్దె వద్ద ప్రతిష్టించారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లిని జనగామ గ్రామంలోని గుడిలో ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతులు ప్రత్యేక పూజలు చేయగా, కోయపూజారులు గద్దెల వద్దకు తీసుకువచ్చారు.