ఐనవోలు, కొత్తకొండకు పోటెత్తిన భక్తులు

  •     మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు
  •     కొత్తకొండలో మొక్కులు చెల్లించుకున్న ఎంపీ బండి సంజయ్‌‌, సీఎం ఓఎస్‌‌డీ శ్రీనివాసులు
  •     ఐనవోలులో సౌకర్యాలు లేక భక్తుల ఇబ్బందులు

వర్ధన్నపేట (ఐనవోలు)/భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా ఐనవోలు, భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.  ఐనవోలులో భక్తుల రద్దీ కారణంగా మల్లన్న దర్శనానికి ఆరేడు గంటల టైం పట్టిందని భక్తులు చెప్పారు.

ఐనవోలు మల్లన్నను శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌‌ బండా ప్రకాశ్‌‌, ఎమ్మెల్సీ బస్వరాజ్‌‌ సారయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌‌, వరంగల్‌‌ డీసీసీబీ చైర్మన్‌‌ రవీందర్‌‌రావు, హనుమకొండ జడ్పీ చైర్మన్‌‌ సునీల్‌‌బాబు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కొత్తకొండలో సూర్య యంత్ర ప్రతిష్ఠాపన నిర్వహించారు. వీరభద్రుడిని కరీంనగర్‌‌ ఎంపీ బండి సంజయ్‌‌, సీఎం ఓఎస్‌‌డీ వేముల శ్రీనివాసులు దర్శించుకున్నారు. భక్తులు స్వామి వార్లకు కోడెమొక్కులు సమర్పించారు.

ఐనవోలులో కానరాని సౌకర్యాలు

ఐనవోలుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్న ఆఫీసర్ల మాటలు అమలుకు నోచుకోవడం లేదు. భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసినప్పటికీ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయలేకపోయారు. జాతర ప్రదేశంలో సరైన వసతులు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి మంచినీళ్లు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాయిలెట్లకు నీటి సౌకర్యం లేకపోవడంతో సులభ్‌‌ కాంప్లెక్స్‌‌కు తాళం వేశారు.

దీంతో మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలాగే కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి ధరలను వ్యాపారాలు ఒక్కసారిగా పెంచేశారు. ఒక్కో కొబ్బరికాయను రూ. 50 నుంచి రూ. 60లకు అమ్ముతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. మరో వైపు జాతరకు వచ్చే రోడ్లకు రిపేర్లు చేయకపోడవంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.