కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారం సాయత్రం క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయమే స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. దర్శనానికి గంటల సమయం పట్టింది. అనంతరం గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. కోడెల స్తంభం వద్ద స్వామి వారికి కోడెలను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపైన రేణుక ఎల్లమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఈవో బాలాజీ, ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకుడు రాములు, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందిచారు. కాగా స్వామివారిని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు
చేశారు.