కిటకిటలాడిన కొండగట్టు
వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్
గంట పాటు వాహనాల్లోనే భక్తులు
కొండగట్టు,వెలుగు : జగిత్యాల జిల్లా కొండగట్టుకు మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. 25 వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జయంతి సందర్భంగా రద్దు చేసిన వివిధ రకాల సేవలను ఆఫీసర్లు తిరిగి ప్రారంభించారు. భక్తులు భారీగా రావడంతో కొండగట్టు వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామైంది. ట్రాఫిక్ క్లియర్ చేయవల్సిన పోలీసులు పట్టించుకోక పోవడంతో గంటపాటు భక్తులు వాహనాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అలాగే స్పెషల్ దర్శనానికి జారీ చేసే టికెట్ కౌంటర్లు ఒకటే ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సామాన్య భక్తులకు అంజన్న దర్శనం కష్టంగా మారింది.
అంజన్న జయంతి ఆదాయం రూ. కోటి ముప్పై లక్షలు
కొండగట్టు ఆలయంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా రూ. 1,30,43,525 ఆదాయం వచ్చినట్లు సూపరింటెండెంట్ సునీల్ మంగళవారం తెలిపారు. దీక్ష విరమణ, కేశఖండనం, స్పెషల్ దర్శనం, లడ్డూ ప్రసాదం, ఆర్జిత సేవల టికెట్ల అమ్మకం ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.