జగిత్యాల జిల్లా: హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. మాల విరమణ కోసం హనుమాన్ భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. అంజన్న దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన హనుమాన్ ఆలయం కావున.. భక్తులు ఈరోజు కొండగట్టు అంజన్నను దర్శనం చేసుకోవడానికి వేలాదిగా తరలివస్తుంటారు.
కొండగట్టు పుణ్యక్షేత్రంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ రామ జయరామ జయ జయ రామ నామ స్మరణతో మార్మోగుతోంది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఉదయాన్నే కోనేటిలో స్నానం ఆచరిస్తున్నారు. నేడు చైత్ర పౌర్ణమితోపాటు అంజన్నకు ఇష్టమైన మంగళవారం కావడంతో పంచామృత అభిషేకం, సహస్ర నాగావళి దళార్చన పూజలు చేస్తున్నారు. స్వామి వారిని ప్రియమైన అరటిపళ్ళతో అలంకరించారు.