మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు

జైపూర్/బెల్లంపల్లి, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా జైపూర్​మండలం వేలాలలోని గట్టు మల్లన్న జాతరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. గుట్టపై కొలువున్న స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయన సతీమణి, గడ్డం సరోజ, కుమారుడు కాంగ్రెస్ యువ నేత వంశీ కృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

జాతర సందర్భంగా పోతరాజులు, లక్ష్మీదేవరల విన్యాసాలు అలరించాయి. సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరైనట్లు ఆలయ ఈఓ రమేశ్ తెలిపారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణాలు శివ నామస్మరణతో మారుమోగాయి. 2 వేల  సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆలయంలో నిత్యం శివలింగంపై పారుతున్న గంగాజలాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్, యువనేత గడ్డం వంశీకృష్ణ తదితరులు మొక్కులు తీర్చుకున్నారు.