ఎత్తు బెల్లం.. ఒడిబియ్యం.. మూడోరోజూ భారీగా తరలివచ్చిన భక్తులు

  • కిక్కిరిసిన క్యూలైన్లలో గంటలకొద్దీ నిలబడి మొక్కులు
  • బంగారం, కానుకలతో నిండిన గద్దెలు 

మేడారం నెట్​వర్క్​, వెలుగు: గద్దెలపై కొలువుదీరిన సమ్మక్కసారక్కలను దర్శించుకునేందుకు మూడోరోజు మేడారానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కిక్కిరిసిన క్యూలైన్లలో  గంటల తరబడి వేచిచూసి మరీ అమ్మలకు మొక్కులు అప్పజెప్పారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి, నేరుగా దర్శనానికి వచ్చారు. ఎత్తు బెల్లం, ఒడిబియ్యం, సారె, చీరెలు సమర్పించి, పిల్లాజెల్లా, గొడ్డుగోదను చల్లంగ చూడాలని వేడుకున్నారు.

శుక్రవారం ఏకంగా 50 లక్షల మంది భక్తులు రావడంతో గద్దెల వద్ద తీవ్ర రద్దీ నెలకొన్నది. దీంతో చాలా మంది అమ్మవార్లకు దగ్గర నుంచి ఒడిబియ్యం, ఎత్తు బెల్లం, చీర, సారె సమర్పించడం సాధ్యం కాక, దూరం నుంచే గద్దెల వైపు విసిరేశారు. దర్శనానికి వచ్చిన భక్తులు గద్దెల నుంచి కొంత బంగారం స్వీకరించడం ఆనవాయితీ కాగా, రద్దీ కారణంగా సాధ్యం కాలేదు. గద్దెల మీది బంగారం దొరకకపోవడంతో చాలా మంది భక్తులు నిరాశగా వెనుదిరిగారు.

మరోవైపు గద్దెలపై భారీగా బంగారం, కానుకలు గుట్టలుగా పోగుపడ్డాయి. గడిచిన మూడురోజుల్లో కోటి మందికిపైగా భక్తులు మేడారంలో తల్లులను దర్శించుకున్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు.  కాగా, జాతరలో ఇప్పటికి 5,080 మంది తప్పిపోగా,   మిస్సింగ్ ​క్యాంపుల ద్వారా 5050 మందిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించామని, మరో 30మంది తమ వద్ద ఉన్నారని మిస్సింగ్స్​ క్యాంప్​ సిబ్బంది శుక్రవారం ప్రకటించారు.

వీఐపీల తాకిడి..సామాన్యుల ఇబ్బందులు 

శుక్రవారం సీఎం రేవంత్‌‌రెడ్డి, గవర్నర్‌‌ తమిళి సై, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌‌ ముండా, ఇతర మంత్రులు వనదేతలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు.  సీఎం, గవర్నర్‌‌ వచ్చిన సమయంలో కొద్ది సేపు క్యూలైన్లను ఆపేశారు. దీంతో సాధారణ క్యూలైన్లలో వచ్చే భక్తులకు అమ్మవార్ల దర్శనం ఆలస్యమైంది. క్యూలైన్లలో తీవ్ర ఒత్తిడి, బయట ఎండవేడిమి కారణంగా పలువురు భక్తులు అస్వస్థతకు లోనయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.   

కాటకలిసినోళ్లను కలిపే సెంటర్లు​!

మేడారం(ములుగు), వెలుగు : జాతరలో కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయిన వారిని మిస్సింగ్ ​కేంద్రాలు కలుపుతున్నా యి. బంధువులు, బిడ్డలు, తల్లులు తప్పిపోయిన వారంతా మిస్సింగ్​కేంద్రాలకు వచ్చి ‘అవ్వా ఏడున్నవే...కొడుకా ఏడవోయినవ్’ అంటూ తమ వాళ్లను మైకుల్లో పిలుస్తున్నరు. మేడారంలో ఆరు మిస్సింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశామని, శుక్రవారం మధ్యాహ్నం వరకు 5097మందిని గుర్తించి బంధువులకు అప్పగించామని ములుగు డీడబ్ల్యూవో జే.ఎం.స్వర్ణలత చెప్పారు. ఇంకా 30 మంది క్యాంపుల్లో ఉన్నారని, వీరికి భోజనం కూడా పెడుతున్నామని చెప్పారు.