ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొనసాగుతున్న నాగోబా జాతరకు ఆదివారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయంలోని పేర్సపేన్, బాన్ పేన్ కు పూజలు చేశారు. వనంలో ఎటు చూసినా జనమే కనిపించారు. మెయిన్ ఎంట్రెన్స్ నుంచి గర్భగుడి వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. నాగోబా దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది.
ఆదివారం ఒక్కరోజే 15 వేల మంది దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. జాతరలో మూడో రోజైన ఆదివారం నాడు మెస్రం వంశీయులు ముందుగా గోవాడ వద్ద బస చేసి సంప్రదాయ వాయిద్యాల నడుమ నాగోబా ఆలయం వెనుక ఉన్న బాన్ దేవత ఆలయానికి చేరుకొని పూజలు చేశారు. భేటింగ్ అయిన కొత్త కోడళ్లు కోనేరు నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చారు. మెస్రం వంశం అల్లుళ్లు బాన్ దేవత ఆలయం ముందున్న పాత పుట్టలను తొలగించారు.
కోనేరు నీటితో మహిళలు కొత్త పుట్టలను తయారు చేశారు. బాన్ దేవతను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు అనంతరం నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం పక్కనే ఉన్న పెర్సపేన్ దేవతను గోదావరి జలంతో శుద్ధిచేసి పూజలు నిర్వహించారు. ఇందులో మెస్రం వంశానికి చెందిన మగవారు మాత్రమే పాల్గొన్నారు. సేశాను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు. గోవాడలో సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం ప్రధాన్ కితకు చెందిన మెస్రం గంగారాం ఆధ్వర్యంలో కిక్రీ వాయిస్తూ కొత్త కోడళ్లకు నాగోబా చరిత్రను, 22 కితల చరిత్రను తెలియజేశారు. 13న గోవడ్ ముఖ ద్వారం వద్ద బేతల్ పూజలతో సంప్రదాయ పూజలు ముగియనున్నాయి. -
వెలుగు, గుడిహత్నూర్