ఒకే రోజు 3 లక్షల మందికిపైగా దర్మించుకున్నరు
ఐనవోలు, వెలుగు: ఒగ్గుడోలు చప్పుళ్లు.. ఢమరుక మోతలతో ఐలోని మల్లన్న క్షేత్రం మారుమోగింది. గొల్ల, కురుమల గజ్జెల లాగుల డ్యాన్సులు, శివసత్తుల పూనకాలతో పులకించింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం భోగి కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఒగ్గుపూజారులతో పసుపు బండారి పట్నాలు వేయించి స్వామివారిని కొలిచారు. ప్రత్యేకంగా నైవేద్యం వండి బోనాలు సమర్పించారు. ఆలయంలో టెంకాయ బంధనం వరం పట్టారు.
కోడె మొక్కులు చెల్లించి, గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. అర్చకులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన, నీరాజన మంత్ర పుష్పం తదితర పూజలు నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనం కోసం అనుమతించారు. వీఐపీ దర్శనాల నేపథ్యంలో ధర్మదర్శనానికి గంటలకొద్దీ వేచిచూడాల్సి రావడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు
ఐలోని మల్లన్నను వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు దర్శించుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మన్సుధీర్కుమార్, నగర మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ తూర్పు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, తాటికొండ రాజయ్య, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, రైతు విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకన్న, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
నీళ్ల పేరున దోపిడీ
స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆలయ ఆవరణలోని వాటర్ ప్లాంట్ రిపేర్ కు గురికాగా.. భక్తులు వాటర్ క్యాన్లపై ఆధారపడాల్సి వచ్చింది. ఆఫీసర్లు వాటర్ట్యాంక్లు తెప్పించినా చాలామంది ఫిల్టర్ వాటర్కే మొగ్గుచూపారు. ఇదే అదునుగా దుకాణదారులు 20 లీటర్ల నీళ్ల క్యాన్కు రూ.80 నుంచి రూ.100 వరకు వసూలు చేశారు.
మంత్రి ఎదుట భక్తుల అసహనం
మల్లన్న దర్శనానికి శనివారం ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి దాదాపు 3 లక్షల మంది వరకు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రి దయాకర్రావుతో పాటు ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఇతర నేతలు వస్తున్నారన్న సమాచారంతో చాలాసేపు భక్తులను లైన్లలో ఆపేశారు. దీంతో చిన్నపిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. లీడర్ల కోసం క్యూ లైన్లను ఎంతసేపు నిలిపి ఉంచుతారని అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆలయంలోకి ఎంటరవడంతో క్యూ లైన్లో ఉన్న భక్తులు వారి అసంతృప్తిని వెల్లగక్కారు. ధర్మదర్శనం కోసం దాదాపు ఐదు గంటల నుంచి ఎండలో ఉంటున్నామని, కనీసం నీళ్లు ఇచ్చేవాళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని మంత్రికి చెప్పారు. లీడర్లు భక్తుల మాటలు వింటూనే ఏం సమాధానం చెప్పకుండానే లోపలికి వెళ్లిపోయారు.