వేలాల జాతరకు పోటెత్తిన భక్తజనం

జైపూర్‌, వెలుగు: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాల మల్లికార్జున స్వామి జాతర శనివారం రెండో రోజు కూడా జోరుగా సాగింది. మొదటి రోజు గుట్టపై ఉన్న గట్టు మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు రెండో రోజు గుట్ట కింది మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. స్వామి వారికి పట్నాలు, బెల్లంతో మొక్కులు సమర్పించుకున్నారు.

భక్తుల రాకపోకలతో వేలాల గ్రామ పరిసరాలు కిక్కిరిశాయి. ఆలయ ప్రాంగణంలో సరైన స్థలం లేకపోవడంతో దర్శనం కోసం క్యూ లైన్లలో ఉన్న భక్తులు ఇబ్బందులు పడ్డారు. మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.   జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, శ్రీరాంపూర్ సీఐ బన్సిలాల్, ఎస్​ఐ ఉపేందర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు .