యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామి వారి దర్శనానికి బారులు తీరారు.  ఉచిత దర్శనానికి 3గంటల సమయం.. స్పెషల్ దర్శనానికి గంట సమయం పడుతుంది. భక్తులతో యాదాద్రి కొండ కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. వ్రత మండపం, లడ్డూ ప్రసాదం కౌంటర్, ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. 

బాసర ఆలయంలోనూ భక్తుల రద్దీ

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో అమ్మవారికి అభిషేకం పుష్పార్చన, కుంకుమార్చన, విశేష పూజలను ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్న గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి, నది ఒడ్డున ఉన్న శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు  ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు జరుగుతున్నాయి. భక్తుల రద్దీ అధికం కావడంతో అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వేములవాడకు పోటెత్తిన భక్తులు

వేములవాడ రాజన్న క్షేత్రానికి సైతం భక్తులు పోటెత్తారు. స్వామివారికి ఇష్టమైన కోడెమొక్కు చెల్లించుకున్నందుకు భక్తులు బారులు తీరారు. అభిషేకం దర్శనం వల్ల సామాన్య భక్తులకు దర్శనానికి ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలోనే స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.