యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పార్కింగ్ ఏరియా, రింగు రోడ్డు, ఘాట్ రోడ్డు భక్తుల వెహికల్స్‌తో నిండిపోయాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో కొందరు భక్తులు ఘాట్ రోడ్డు, మెట్ల మార్గం గుండా కొండపైకి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. దర్శన క్యూలైన్లు నిండిపోవడంతో.. ఎస్పీఎఫ్ పోలీసుల సహకారంతో తాత్కాలిక క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకునేలా డైవర్షన్లు పెట్టి దర్శన భాగ్యం కల్పించారు. ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం పట్టింది.
భక్తులు జరిపించిన పలురకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. వివిధ పూజల ద్వారా రూ.64,50,178 ఇన్ కం రాగా.. ఇందులో అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.22,19,960, కొండపైకి వెహికల్స్ ప్రవేశంతో రూ.8.50 లక్షలు వచ్చాయి.