యాదగిరి గుట్టకు పౌర్ణమి శోభ .. భక్తులతో కిటకిటలాడిన ఆలయం

యాదగిరి గుట్టకు పౌర్ణమి శోభ .. భక్తులతో కిటకిటలాడిన ఆలయం
  • ఒక్కరోజే 2,090 మంది దంపతుల వ్రతాలు
  • కనుల విందుగా కార్తీక దీపోత్సవం 
  • ఆలయానికి రూ.51.22 లక్షల రాబడి

యాదగిరిగుట్ట,వెలుగు: కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. యాదగిరికొండ, పాతగుట్ట సందడి నెలకొంది. శివాలయం, వ్రత మండపాలు, దీపారాధన ప్రదేశాలు కిక్కిరిశాయి. వేకువజాము నుంచే భక్తులు రాగా..  రాత్రి వరకు భక్తజనసందోహం కనిపించింది. దర్శన క్యూ లైన్లు, లడ్డూ ప్రసాద క్యూలైన్లు కిటకిటలాడాయి. గంటలకొద్దీ నిరీక్షించారు. ధర్మ దర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నరకుపైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు.

కిక్కిరిసిన వ్రత మండపాలు 

కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణస్వామి వ్రతాలు చేసే దంపతులతో కొత్త, పాతగుట్ట ప్రాంతాలు రద్దీగా మారాయి. వ్రత టికెట్ల కోసం గంటల కొద్దీ నిరీక్షించారు. కొత్త గుట్టలో ఉదయం 5:30 నుంచి రాత్రి 7 వరకు ఎనిమిది బ్యాచ్ లు,  పాతగుట్ట లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు బ్యాచ్ ల్లో మొత్తం 2,090 మంది జంటలు వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నాయి. వ్రతాల ద్వారా ఆలయానికి రూ.16.72 లక్షల ఆదాయం సమకూరింది. అన్ని రకాల పూజల ద్వారా రూ.51,22,947 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.