భక్తులతో కిక్కిరిసిన యాదగిరిగుట్ట నర్సన్న, రాజన్న ఆలయాలు

భక్తులతో కిక్కిరిసిన యాదగిరిగుట్ట నర్సన్న, రాజన్న ఆలయాలు
  • గుట్టలో ధర్మదర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట టైం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్‌‌‌‌తో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పరిసరాలు, క్యూలైన్లు రద్దీగా మారాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూకాంప్లెక్స్, క్యూలైన్లలో గంటల తరబడి వెయిట్‌‌‌‌ చేయాల్సి వచ్చింది.

 రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్‌‌‌‌ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆదివారం భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.36,07,901 ఆదాయం సమకూరింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.14,60,970, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.4.50 లక్షల ఇన్‌‌‌‌కం వచ్చిందని ఆఫీసర్లు తెలిపారు.

వేములవాడకు 40 వేల మంది రాక

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్నను ఆదివారం 40 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. తలనీలాలు సమర్పించిన అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. భారీ సంఖ్యలో కోడె మొక్కులు చెల్లించారు. ప్రధానాలయం, కల్యాణకట్ట, ప్రసాద విక్రయశాలను ఈవో వినోద్‌‌‌‌రెడ్డి తనిఖీ చేశారు.