- 29న మౌని అమావాస్య రోజు మరో పది కోట్ల మంది రావచ్చని అంచనా
- కుంభమేళాకు 150 ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వేశాఖ
లక్నో/న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు త్రివేణీ సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది.
భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని..స్నానం చేయడానికి ప్రతిరోజు లక్షలాది మంది వస్తున్నారని వెల్లడించింది. షాహి స్నాన్(పవిత్ర స్నానాలు) సమయంలో ఈ సంఖ్య కోట్లకు చేరుతున్నదని వివరించింది.
గురువారం ఒక్కరోజే ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 30 లక్షల మంది సంగమంలో స్నానం చేశారని తెలిపింది. పండుగ రోజుల్లో మాత్రమే ఆంక్షలు విధిస్తున్నామని.. మిగిలిన రోజుల్లో ఎలాంటి ఆంక్షలు ఉండవని పేర్కొంది. సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యధిక సంఖ్యలో సుమారు 3.5 కోట్ల మంది భక్తులు స్నానాలు చేయగా..పౌష్ పూర్ణిమ పండుగ వేళ 1.7 కోట్లకు పైగా భక్తులు పాల్గొన్నారు.
మౌని అమావాస్య సందర్భంగా 150 స్పెషల్ ట్రైన్స్
ఈ నెల 29 న మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తారని అధికారులు అంచనా వేశారు. ఆ ఒక్కరోజే 10 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని భావిస్తున్నారు.
రద్దీని దృష్టిలో పెట్టుకొని యూపీ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశ నలుమూలల నుంచి 150 ప్రత్యేక రైళ్లను ప్రయాగ్ రాజ్ కు నడపనుంది. కాగా..పుష్యమాసంలో వచ్చే చివరి అమావాస్యను సర్వేషాం అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని అంటారు. మౌని అమావాస్య రోజు పుణ్యస్నానం చేసి, పితృతర్పణాలు విడిస్తే దోషాలు పోతాయని, విశేష పుణ్యఫలం దక్కుతుందని భావిస్తారు.