![వన దేవతల దర్శనానికి తరలివస్తున్న భక్తులు](https://static.v6velugu.com/uploads/2025/02/devotees-flocking-to-see-the-sammakka-saralamma-mini-madaram-celebrations_8cVWDQHk7Y.jpg)
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతున్న మినీ మేడారం జాతరకు భక్తులు తరలివస్తున్నారు. జాతర మూడవ రోజు శుక్రవారం దేవతల దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రైవేట్ వెహికల్స్, ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చి సమ్మక్క, సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు.
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండోమెంట్ అధికారులు క్యూ లైన్ లో తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. గద్దెల వద్ద ఇబ్బంది పడకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భక్తులు విడిది చేసే ప్రాంతాల వద్దకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సప్లై చేశారు. కలెక్టర్ దివాకర టీఎస్ మినీ మేడారం జాతరకు వచ్చి వనదేవతలను దర్శనం చేసుకున్నారు. గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరె సారె, పూలు సమర్పించి పూజలు చేశారు.
ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలోని మేడారం, ఐలాపూర్, కొండాయి, మల్యాల గ్రామాల్లో జరుగుతున్న జాతరను విజయవంతం చేశామని చెప్పారు.
మొక్కులు చెల్లించుకున్న మంత్రి సీతక్క..
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయిలో గోవిందరాజులు, నాగులమ్మ, సారలమ్మ జాతర, కన్నాయిగూడెం మండలం ఐలాపురంలో సమ్మక్క, సారలమ్మ జాతరకు మంత్రి సీతక్క హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. వన దేవతల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొండాయి, ఐలాపూరం, బయ్యక్కపేటలో నిర్వహిస్తున్న జాతరలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు.