భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

 భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

భద్రాచలం, వెలుగు :  కార్తీక మాసం, వీకెండ్​ కారణంగా ఆదివారం భద్రాచలం సీతారామచంద్రస్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునేందుకు వచ్చారు. ఉదయం నుంచే ఆలయంలోని క్యూలైన్లన్నీ భక్తులతో పోటెత్తాయి. దర్శనానికి సుమారు గంట సమయం పట్టింది. గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరించిన భక్తులు దర్శనం కోసం వచ్చారు. మరో వైపు పాపికొండల విహార యాత్ర కారణంగా టూరిస్టులు రావడంతో రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. 

గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి అర్చకులు గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం చేశారు. భక్తులకు మంజీరాలు పంపిణీ చేశారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన జరిగింది. బేడా మండపంలో సీతారాములకు నిత్య కల్యాణం నిర్వహించారు. కంకణాలు ధరించిన భక్తులు క్రతువులో పాల్గొన్నారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. 

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శివాలయంలో ఆదివారం రాత్రి జరిగిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు లలిత సహస్రనామ పారాయణం చేయగా, వాణీ రామం బృందం భక్తి గీతాల ఆలాపన, శ్రీ అభినయ కూచిపూడి నాట్య నిలయం వారి కూచిపూడి, భరత నాట్యం అలంరించాయి.