కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు.. మరో 4 రోజులే ఉండడంతో భారీగా పెరిగిన రద్దీ

కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు.. మరో 4 రోజులే ఉండడంతో భారీగా పెరిగిన రద్దీ
  • ఇప్పటికే 60 కోట్ల మంది పుణ్యస్నానాలు
  • మహాశివరాత్రికి పకడ్బందీగా ఏర్పాట్లు 
  • యాత్రికుల భద్రత కోసం ఏఐతో నిఘా

ప్రయాగ్ రాజ్ : మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. కుంభమేళా ముగిసేందుకు మరో నాలుగు రోజులే ఉండడంతో శనివారం భక్తులు భారీ సంఖ్యలో మేళాలో పాల్గొని పుణ్యస్నానాలు చేశారు. ఆ ఒక్క రోజే నాలుగు కోట్ల మంది త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. జనం రద్దీగా ఉన్నా ఏర్పాట్లలో అధికారులు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఈనెల 26న మహాశివరాత్రి రోజు కుంభమేళా ముగియనుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఆరోజు భారీగా వస్తారని అధికారులు భావిస్తున్నారు. వారి రద్దీని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు అధికారుల ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మహాకుంభ్  మేనేజ్ మెంట్  చాలా అద్భుతంగా ఉంది. ఇన్ని కోట్ల మంది సందర్శిస్తున్నా.. మేళా ప్రాంతం చాలా హైజీనిక్ గా ఉంది. ఇంత గొప్ప ఏర్పాట్లు చేస్తున్న యోగి సర్కారుకు థ్యాంక్స్” అని మేళాలో పాల్గొన్న ఓ మహిళ పేర్కొంది. కాగా.. కుంభమేళాలో ఇప్పటిదాకా 60 కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారని అధికారులు తెలిపారు. మరోవైపు తొక్కిసలాట వంటివి జరగకుండా, యాత్రికుల భద్రత కోసం ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో  నిఘా పెడుతున్నామని అధికారులు తెలిపారు. 4 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కుంభమేళా ప్రాంతంలో 2,750 సీసీటీవీ కెమెరాలు అమర్చారు. 250 కెమెరాల్లో ఏఐ టెక్నాలజీ ఇన్ స్టాల్  చేశారు. కెమెరాలన్నింటినీ ఇంటిగ్రేటెడ్  కంట్రోల్  అండ్  కమాండ్  సెంటర్ కు అనుసంధానించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

కుంభమేళాతో యూపీ సత్తా చాటాం : యోగి

మహా కుంభమేళాతో యూపీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని సీఎం యోగి ఆదిత్యనాథ్  అన్నారు. శనివారం లఖీంపూర్  ఖేరీలో రూ.4,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. అభివృద్ధి పనులకు కుంభమేళా అడ్డంకి అనే వారికి సమాధానం దొరికిందని ప్రతిపక్షాలను ఆయన ఎద్దేవా చేశారు. ‘‘ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళా ఒక్కటి చాలు యూపీ సత్తా ఏంటో ప్రపంచానికి చెప్పడానికి. ‘‘జనవరి 13 నుంచి ఈనెల 22 వరకు  60 కోట్లకుపైనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళా నిర్వహణ తీరును ప్రపంచమంతా పొగుడుతున్నది. దేశ, రాష్ట్ర అభివృద్ధిని ఇష్టపడని వారే మహాకుంభ్ పై విమర్శలు చేస్తున్నారు” అని యోగి వ్యాఖ్యానించారు.

యోగి, జేపీ నడ్డా పుణ్యస్నానాలు 

కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా  శనివారం కుంభమేళాలో పాల్గొన్నారు. ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్  స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. అనంతరం యోగి, డిప్యూటీ సీఎం బ్రజేష్  పాఠక్ తో కలిసి నడ్డా ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, సినీ నటి తమన్నా భాటియా కూడా కుంభమేళాలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం చేసి పూజలు నిర్వహించారు. 

కుంభమేళా నీళ్లు లీటరు రూ.990!

లీటరు కుంభమేళా నీళ్లను ఈ కామర్స్ లో రూ.990కు అమ్ముతున్నారని, మతం ఆధారంగా వ్యాపారం చేస్తున్నారని షీల్డ్  ఇండియా వ్యవస్థాపకుడు నమన్ బీర్ సింగ్  అన్నారు. ‘‘మహాకుంభ్  సంగమ్ గంగా జల్  పేరుతో 100 ఎంఎల్ ను రూ.99కు అమ్ముతున్నారు. అంటే లీటరుకు రూ.990. ధర్మం పేరుతో ఇలా వ్యాపారం చేయడం సరికాదు. అంతేకాకుండా అసలు ఆ నీళ్లు కుంభమేళావేనా అన్న అనుమానం కలుగుతోంది” అని నమన్ బీర్  లింక్డ్ ఇన్ లో పోస్టు చేశారు.