- డిసెంబర్లో 50 శాతం పెరిగిన గుడుల ఇన్కం
- ఫ్రీ బస్ సౌకర్యంతో భారీగా తరలి వస్తున్న మహిళా భక్తులు
- ముందస్తు మేడారం మొక్కులతో పెరిగిన తాకిడి
- ఒక్క డిసెంబర్ నెలలో యాదాద్రి నర్సన్న ఆదాయం రూ.41 కోట్లు
యాదాద్రి/ వేములవాడ, వెలుగు : రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో ‘ఫ్రీ జర్నీ’ స్కీంతో వేములవాడ రాజన్న, యాదాద్రి నర్సన్న టెంపుళ్లకు తాకిడి ఎక్కువైంది. స్వామివార్ల హుండీలు కానుకలతో నిండిపోతున్నాయి. హుండీలు, వివిధ రకాల ఆర్జిత సేవలతో ఆలయాల ఆదాయం భారీగా పెరుగుతోంది. ఒక్క డిసెంబర్ నెలలోనే యాదాద్రి హుండీ ఆదాయం రూ. 3 కోట్లు దాటింది. అన్నిరకాల సేవలతో రూ.38.16 కోట్ల ఆదాయం వచ్చింది. యాదాద్రి టెంపుల్ చరిత్రలో ఇదే హయ్యస్ట్.
బస్సుల్లో విపరీతమైన రద్దీ
కాంగ్రెస్అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ సదుపాయం కల్పించింది. అప్పటివరకు వీకెండ్లు, పండుగ రోజుల్లో తప్ప యాదాద్రి టెంపుల్లో ఎక్కువ రష్ ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. యాదగిరి గుట్ట మీదుగా వెళ్తున్న ప్రతి బస్సు రద్దీగా కనిపిస్తోంది. యాదాద్రి టెంపుల్కు మామూలు రోజుల్లో 15 వేల నుంచి 20 వేల మంది భక్తులు వచ్చేవారు. శని, ఆదివారాలు, పండుగ రోజులు, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసంలో ఈ సంఖ్య 30 వేలకు పైగా ఉంటుంది.
కానీ, ఫ్రీ జర్నీ సదుపాయం కల్పించినప్పటి నుంచి మామూలు రోజుల్లోనూ భక్తుల సంఖ్య 30 వేలకు తగ్గడం లేదు. ఇక శని, ఆదివారాల్లో 50 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. గత నెల12వ తేదీతో కార్తీక మాసం ముగిసినా, ప్రస్తుతం అప్పటి కంటే ఎక్కువ మంది భక్తులు గుట్టకు వస్తున్నారు. ఫ్రీ జర్నీతో పాటు ప్రస్తుతం ధనర్మాసం పూజలు కొనసాగుతుండడంతో తాకిడి ఎక్కువగా ఉంది.
28 రోజుల్లో రెండింతలు
భారీగా తరలివస్తున్న భక్తులతో యాదాద్రి ఆలయ ఆదాయం రెండింతలు పెరిగింది. ఈ నెల 4న హుండీలను లెక్కంచగా గతంలో ఎన్నడూ లేనంతగా 28 రోజుల్లో రూ.3 కోట్ల15లక్షల5వేల35 ఆదాయం వచ్చింది. వీఐపీ, బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, వాహనాల ప్రవేశం, ప్రసాద విక్రయాలు పెరగడంతో కాసుల వర్షం కురిసింది. 2023 జనవరి ఒకటి నుంచి డిసెంబరు 30 వరకు వివిధ విభాగాల ద్వారా రూ.147,36,01,198 ఆదాయం వస్తే ఇందులో ఒక్క డిసెంబర్లోనే రూ.38,16, 24,604 వచ్చింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యాదగిరిగుట్టకు నేరుగా బస్సర్వీసులు పెద్దగా లేవు. హైదరాబాద్, నల్గొండ నుంచి మాత్రమే డెరెక్ట్ బస్సులు ఉన్నాయి. వరంగల్ వైపు నుంచి వచ్చే భక్తులు రాయగిరి వద్ద దిగి అక్కడి నుంచి యాదగిరిగుట్టకు చేరుకుంటున్నారు. అన్ని జిల్లాల నుంచి నేరుగా గుట్టకు బస్సులు ఏర్పాటు చేస్తే రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
శివరాత్రిని తలపిస్తున్న ఎములాడ
డిసెంబర్ 10 నుంచి వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తుల తాకిడి అధికమైంది. ఫ్రీబస్ జర్నీతో మహిళా భక్తులు ఎక్కువగా వస్తున్నారు. మరోవైపు మేడారం మహా జాతరకు ముందే చాలా మంది భక్తులు తరలివెళ్లి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అక్కడికి వెళ్లే భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో రోజుతో సంబంధం లేకుండా రాజన్న గుడికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సోమవారం రోజైతే వేములవాడ శివరాత్రిని తలిపిస్తోంది.
ఫ్రీబస్ జర్నీ అమల్లోకి వచ్చాక మహిళా భక్తులు పెరిగారని ఆలయ సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. ఒక్క డిసెంబర్ లోనే హుండీలు, కోడె మొక్కులు, ప్రసాదాలు, వసతి గదులు, లీజు లైసెన్స్ ల ద్వారా రూ.7కోట్ల50 లక్షలు వచ్చినట్లు చెప్పారు.