అన్ని దారులు మేడారం వైపే

అన్ని దారులు  మేడారం వైపే

జయశంకర్‌‌ భూపాలపల్లి/ తాడ్వాయి, వెలుగు: మేడారం వనదేవతల నామస్మరణతో మార్మోగింది. బుధవారం మేడారం మినీ జాతర ప్రారంభం కాగా, దారులన్నీ అమ్మవార్ల ఆలయాల వైపే సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, మొక్కులు తీర్చుకున్నారు.

తరలొచ్చిన భక్తులు..

ఏడాది తర్వాత మేడారం మళ్లీ జనసంద్రమైంది. సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. తలనీలాలు, ఎత్తుబెల్లం సమర్పించారు. మినీ జాతర మొదటి రోజు ఆదివాసీ పూజారులు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పున్నమివేళల్లో తల్లులను స్మరించుకుంటూ జాగారం చేశారు. భక్తుల రాకతో జంపన్నవాగు కిటకిటలాడింది. కాగా, మేడారం మినీ జాతరకు ప్రభుత్వం రూ.5.30 కోట్లతో ఏర్పాట్లు చేసింది. జంపన్నవాగులో నీళ్లు లేకపోవడంతో భక్తుల స్నానాల కోసం వాటర్‌‌ ట్యాప్స్‌‌ ఏర్పాటు చేయగా, జాతరకొచ్చిన పిల్లలకు ఐసీడీఎస్‌‌ తరపున ఉచితంగా బాలామృతం అందించారు. గద్దెల చుట్లూరా హైమాస్ట్‌‌  లైట్లను అమర్చారు. గద్దెల వద్ద నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు, హుండీల రక్షణ కోసం పారిశుద్య సిబ్బందిని నియమించారు. గద్దెలకు సమీపంలోని కల్యాణ మండపంలో ప్రభుత్వ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణంలో 50 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. 

మేడారాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవో.. 

మేడారం మినీ జాతరను ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా సందర్శించారు. స్థానికంగా ఉన్న పాఠశాలలో భోజన ఏర్పట్లు, ఆహారాన్ని తనిఖీ చేశారు. స్టాక్​ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆదివాసీ గిరిజన మ్యూజియాన్ని సందర్శించి, ఆవరణలో పారిశుద్ధ్య ఏర్పాట్లు, మ్యూజియంలోని వస్తువులపై యాత్రికులకు సరైన మార్గనిర్దేశం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.