రెండు నెలల ముందే మేడారానికి పోటెత్తిన భక్తులు

 

  • కరోనా, రద్దీ భయంతో ముందస్తు మొక్కులు.. సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద తోపులాట
  • తల్లులను లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకున్నరు.. తాగునీరు, టాయిలెట్లు, బాత్రూంలు లేక అవస్థలు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు:  మేడారంలోని వన దేవతల దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో ఆదివారం లక్షకుపైగా తరలివచ్చారు. జాతర టైంలో రద్దీతోపాటు, కరోనా కేసులు పెరిగితే మళ్లీ రాలేమేమోనని భావిస్తున్న భక్తులు రెండు నెలల ముందుగానే అమ్మల దర్శనానికి బయలుదేరుతున్నారు. కుటుంబ సమేతంగా మేడారానికి వచ్చి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బెల్లం మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం వెల్లువలా తరలివచ్చిన భక్తులతో మేడారం ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. దేవతల గద్దెల వద్ద రద్దీ కారణంగా ఒక దశలో తోపులాట జరిగింది. ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఆఫీసర్లు అంచనా వేయలేదు. జాతర పనులు ఇప్పుడిప్పుడే మొదలుకావడంతో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాలేదు. తాగునీరు, బాత్రూంలు, టాయిలెట్లు సరిపడా లేక ఇబ్బందులు పడ్డారు. ఆదివారం ఉదయం 6 గంటలకు మేడారంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ప్రైవేట్‌‌‌‌వెహికిల్సే కనిపించాయి. మేడారం ‒ తాడ్వాయి, నార్లాపూర్‌‌‌‌ ‒ మేడారం రోడ్లకు ఇరువైపులా చెట్ల కింద, పంట పొలాల్లో టెంట్లు వేసుకొని భక్తులు విడిది చేశారు. కన్నెపల్లి రోడ్డు వైపు వాహనాలు పార్క్​చేసుకోవడానికి పోలీసులు అనుమతిచ్చారు. అక్కడి నుంచి గద్దెల వరకు భక్తులు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. జంపన్నవాగు నుంచి మేడారం వైపు వచ్చే రోడ్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆర్టీసీ బస్టాండ్‌‌, చిలకలగుట్ట, కన్నెపల్లి వైపు‌‌ భక్తులు ఎక్కువ మంది విడిది చేశారు. బస్టాండ్‌‌‌‌ నుంచి జంపన్నవాగు, గద్దెల వరకు ప్రైవేట్​ఆటోలు నడిచాయి.

గ్రిల్స్​తెరిచి ఉండటంతో.. 

సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు ఇంకా 2 నెలల సమయం ఉంది. దీంతో గద్దెల చుట్టూ ఉండే గ్రిల్స్​ను నిర్వాహకులు తెరిచే ఉంచారు. ఆదివారం భారీగా తరలివచ్చిన భక్తులు గద్దెలను తాకడానికి పోటీ పడ్డారు. దగ్గరకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం సమర్పించారు. క్యూలైన్లలో కొద్దిపాటి తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లారు. ఆలయ పరిసరాల్లోని షాపులు, హోటళ్లు భక్తులతో కిక్కిరిశాయి. మేడారం మహాజాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.75 కోట్లు కేటాయించింది. టెండర్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌ నడుస్తోంది. ఇంకా అభివృద్ధి పనులు మొదలు కాలేదు. ఈలోగానే భక్తులు తరలివస్తుండడంతో ఆఫీసర్లు తలపట్టుకుంటున్నారు.