బాలరాముడికి ఏడాది..అయోధ్యలో ఘనంగా తొలి వార్షికోత్సవం

  • మూడ్రోజుల పాటు వేడుకలు  
  • తరలివచ్చిన వేలాది మంది భక్తులు 

అయోధ్య: ఉత్తరప్రదేశ్​లోని అయోధ్య భక్తజన సంద్రమైంది. రామనామంతో మార్మోగిపోతున్నది. విద్యుత్ దీపాల కాంతుల్లో వెలిగిపోతున్నది. రామమందిరం తొలి వార్షికోత్సవం సందర్భంగా వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఘనంగా ఏర్పాట్లు చేసింది. 

శనివారం ప్రారంభమైన ఈ వేడుకలు మూడ్రోజుల పాటు జరగనున్నాయి. బాలరాముడిని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. అభిషేకం చేసి, హారతి ఇచ్చారు. ఈ వేడుకలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 

‘‘అయోధ్య రామనామంతో మార్మోగిపోతున్నది. దేశం నలుమూలల నుంచి భక్తజనం తరలివచ్చారు. ఎంతో ఉత్సాహంతో తొలి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు” అని ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు. ‘‘ఆలయానికి సాధారణ రోజుల్లో రోజూ సగటున 1.5 లక్షల మంది భక్తులు వస్తున్నారు. 

ఈ మూడ్రోజులు భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు 3 కోట్ల మందికి పైగా భక్తులు అయోధ్యకు వచ్చారు” అని అయోధ్య మేయర్ గిరీశ్ త్రిపాఠి చెప్పారు. ‘‘2024 జనవరి 22న రామ్ లల్లాకు ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ చేశారు. 

అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం శనివారం వార్షికోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలు మూడ్రోజులు జరుగుతాయి” అని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ మెంబర్ అనిల్ మిశ్రా వెల్లడించారు. ఈ వేడుకల్లో 110 మంది వీఐపీలు పాల్గొంటారని ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు.