ఖైరతాబాద్, వెలుగు : సిటీలో గణేశ్ నవరాత్రోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. శనివారం సీఎం రేవంత్రెడ్డి ఖైరతాబాద్ మహా గణపతికి తొలిపూజ చేసిన వెంటనే భక్తజనం పోటెత్తింది. ఆదివారం కూడా సెలవు దినం కావడంతో ఖైరతాబాద్ మహా గణేశుడి పరిసరాల్లో ఎటు చూసినా జన సంద్రమే కనిపించింది. పిల్లాపాపలతో తరలివచ్చిన భక్తులు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
ఒక్కరోజే సుమారు 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డి, మాధవీ లతతో పాటు, ఇతర పార్టీల లీడర్లు వినాయకుడి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మూడు క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు, వాలంటీర్లు జాగ్రత్తలు తీసుకున్నారు.