తిరుమల.. తిరుమల.. వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మరో ప్రమాదం జరిగింది. స్వామి వారి దర్శనం తర్వాత.. అందరికీ ఇష్టమైన లడ్డూ ప్రసాదం తీసుకోవటం ఆనవాయితీ. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కనే ఉన్న లడ్డూ కౌంటర్ లో మంటలు వచ్చాయి. అగ్ని ప్రమాదం జరిగింది. 2025, జనవరి 13వ తేదీ ఉదయం జరిగిన ఈ ఘటనతో.. భక్తులు భయాందోళనలకు గురయ్యారు. పరుగులు తీశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల శ్రీవారి దేవస్థానం 47వ నంబర్ కౌంటర్లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కౌంటర్ లోని కంప్యూటర్ సిస్టం యుపిఎస్ లో షార్ట్ సర్క్యూట్ రావడంతో మంటలు వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. షాక్ సర్క్యూట్ తో యుపిఎస్ ఒక్క సారిగా పేలిపోయి మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
తిరుమల లడ్డూ ప్రసాదం పంపిణీ చేసే కౌంటర్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటం సహజమే. అయితే లడ్డూల పంపిణీ జరుగుతున్న సమయంలో మంటలు రావడం ఆందోళన కలిగించింది.
ఇటీవలే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరు మంది మృతి చెందారు. జనవరి 13వ తేదీ ఉదయం లడ్డూ కౌంటర్ వద్ద మంటలు చెలరేగడంతో.. గత అనుభవాల దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు.