మేడారం -జాతర ఎఫెక్ట్ కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

  •     తరలివచ్చిన 50 వేల మంది...
  •     అంజన్న సర్వ దర్శనానికి  సుమారు 3 గంటల సమయం
  •     ఒకే రోజు రూ.16 లక్షల రికార్డు స్థాయి ఆదాయం

కొండగట్టు, వెలుగు :  జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు కొండకు క్యూ కట్టారు. లైన్లన్నీ పూర్తిగా నిండిపోవడంతో ఎండలో చిన్నపిల్లలతో నిలబడిన భక్తులు అవస్థలు పడాల్సి వచ్చింది. అంజన్న సర్వదర్శనానికి సుమారు 3 గంటలు పట్టింది. అంతరాలయంలో స్వామి దర్శనం చేసుకోవడానికి కూడా టైం ఇవ్వడం లేదని, టెంపరరీ సిబ్బంది వెంట వెంటనే తోసేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉండడంతో పోలీసులు కొద్దిసేపు ఘాట్ రోడ్డు పైకి వాహనాలను అనుమతించలేదు.

బొజ్జ పోతన్న గుడి దాటి జేఎన్టీయూ వరకు వెహికల్స్​నిలిచిపోయాయి. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి వచ్చి అంజన్నను దర్శించుకున్నారు. గతంలో కట్టిన ముడుపు విప్పారు. స్పెషల్ దర్శనం, ప్రసాదం టికెట్ల అమ్మకం ద్వారా మంగళవారం రూ.16 లక్షల రికార్డు స్థాయి ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇంత ఇన్​కం హనుమాన్​జయంతి టైంలోనే వస్తుందన్నారు. ఈవో వెంకటేశ్, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్లు శ్రీనివాస శర్మ, సునీల్ పాల్గొన్నారు.