కిటకిటలాడిన శివాలయాలు

కిటకిటలాడిన శివాలయాలు
  • కార్తీక సోమవారం కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
  • ఎములాడలో ధర్మదర్శనానికి 7, బ్రేక్‌‌‌‌ దర్శనానికి 2 గంటల టైం
  •  కోడె మొక్కుల టికెట్లు బ్లాక్‌‌‌‌లో అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌
  •  రద్దీ కారణంగా 13 నుంచి 15 వరకు అభిషేక పూజలు రద్దు
  •  యాదగిరిగుట్టలో 661 సత్యనారాయణస్వామి వ్రతాలు

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయం సోమవారం శివనామస్మరణతో మార్మోగింది. కార్తీకమాసం, రెండో సోమవారం కావడంతో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆదివారం రాత్రే వేములవాడకు చేరుకున్న భక్తులు సోమవారం తెల్లవారుజామున 2 గంటల నుంచే క్యూలైన్ లో వేచి ఉన్నారు. రద్దీ కారణంగా స్వామి వారి గర్భగుడి దర్శనం నిలిపివేసి కేవలం లఘుదర్శనం మాత్రమే అమలు చేశారు. అయినప్పటికీ తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది.

స్వామి వారి ధర్మదర్శనానికి 7 గంటలు, బ్రేక్‌‌‌‌ దర్శనానికి 2 గంటల టైం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామి వారి దర్శనం అనంతరం కార్తీక దీపాలు వెలిగించి, కోడె మొక్కులు చెల్లించారు. మరో వైపు ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ, గోపూజ నిర్వహించి వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకంనిర్వహించారు. రాత్రి ఆలయంలోని అద్దాల మండపంలో మహాలింగార్చన జరిపారు. 

బ్లాక్‌‌‌‌లో కోడె టికెట్ల విక్రయం.. ఇద్దరి పట్టివేత

వేములవాడ రాజన్న ఆలయ కోడె మొక్కుల టికెట్లను బ్లాక్‌‌‌‌లో విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారిని కామారెడ్డి జిల్లా అన్నారం గ్రామానికి చెందిన రమేశ్‌‌‌‌కుమార్‌‌‌‌, సిరిసిల్ల జిల్లా తిమ్మపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌‌‌‌గా గుర్తించారు.

13 నుంచి 15 వరకు అభిషేకాలు రద్దు 

కార్తీక మాసంలో వేములవాడలో రద్దీ పెరుగుతుండడంతో ఈ నెల 13 నుంచి 15 వరకు అభిషేక పూజలను రద్దు చేసినట్లు ఈవో వినోద్‌‌‌‌రెడ్డి తెలిపారు. గర్భాలయంలో భక్తులతో నిర్వహించే అభిషేకాలను నిలిపివేశామని, అన్నపూజలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయన్నారు.

యాదగిరిగుట్టలో...

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం సోమవారం కార్తీక పూజలు జరిపించే భక్తులతో కోలాహలంగా మారింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి సత్యనారాయణస్వామి వ్రతాలు, బిల్వార్చన, నిజాభిషేకం నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు. భక్తుల రాకతో శివాలయం, వ్రతమండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు కిటకిటలాడాయి. యాదగిరిగుట్టలో సోమవారం 661 మంది సత్యనారాయణస్వామికి వ్రతాలు నిర్వహించుకున్నారు. ఈ వ్రతాల ద్వారా ఆలయానికి రూ.5.29 లక్షల ఆదాయం వచ్చింది. మరో వైపు ప్రధాన ఆలయంలో పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా రూ.28,92,444 ఇన్‌‌‌‌కం వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు.