లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్.. తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 24 గంటలు

లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్.. తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 24 గంటలు

కలియుగ వైకుంఠం తిరుమల భక్తజన సంద్రంగా మారింది.. పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు పోటెత్తడంతో సప్తగిరులు గోవిందనామ స్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవారం ( ఏప్రిల్ 18 ) గుడ్ ఫ్రైడే కావడంతో లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది.. ఇంకేముంది.. ఫ్యామిలీతో కలిసి కలియుగదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పయనమయ్యారు ఇరు తెలుగు రాష్ట్రాల జనం. దీంతో తిరుమల నడక మార్గాలలో సైతం భక్తుల రద్దీ పెరిగింది.

శనివారం ( ఏప్రిల్ 19 ) కూడా భక్తుల రద్దీ కొనసాగితున్న క్రమంలో సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట TBC వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.ఇక టైమ్ స్లాట్ ( SSD) దర్శనానికి 6 గంటలు, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోందని సమాచారం.

ఇదిలా ఉండగా.. శుక్రవారం తిరుమల శ్రీవారిని 58,519 మంది భక్తులు దర్శించుకోగా.. 30,360 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నట్లు తెలిపారు టీటీడీ అధికారులు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.27 కోట్ల వచ్చినట్లు తెలిపారు అధికారులు. భక్తుల రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేపట్టామని..  రద్దీ ప్రాంతాలలో శ్రీవారి సేవకుల ద్వారా పాలు, నీళ్ళు, అన్న ప్రసాదాలు పంపిణి చేస్తున్నామని తెలిపారు టీటీడీ అధికారులు.