దారులన్నీ లింగమయ్య జాతర వైపే.. ఓ లింగా.. ఓ లింగా నమస్మరణతో మార్మోగిన పెద్దగట్టు

దారులన్నీ లింగమయ్య జాతర వైపే.. ఓ లింగా.. ఓ లింగా నమస్మరణతో మార్మోగిన పెద్దగట్టు
  • భక్తులతో కిక్కిరిసిన ఆలయ పరిసరాలు 
  • భారీగా వెలిసిన దుకాణాలు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి లింగమంతులస్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఓ లింగా.. ఓ లింగా నామస్మరణతో గొల్లగట్టు మార్మోగింది. డిల్లెం.. బల్లెం భేరి మోతలు, గజ్జెల సవ్వడులు.. యాదవ సాంప్రదాయ నృత్యాలతో లింగమతులస్వామి జాతరలో వైభవంగా తొలి ఘట్టం పూర్తి అయ్యింది. యాదవులు, గిరిజనులు లింగమంతులస్వామి వారిని దర్శించుకున్నారు. గంపలు, బోనాలు తలపై పెట్టుకొని కటారీలు చేతపట్టి.. బేరీలు మోగిస్తూ కాళ్లకు గజ్జెలు కట్టి నృత్యాలు చేస్తూ స్వామివారికి బోనాలు సమర్పించారు. ఉదయం నుంచే సూర్యాపేట జిల్లా కేంద్రం, పరిసర ప్రాంతాల భక్తులు లింగమంతులస్వామి, ఆకుమంచమ్మ, యలమంచమ్మ, చౌడమ్మ దేవతలను దర్శించుకున్నారు.

భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. కోనేరులో భక్తులు స్నానాలు చేసి సారలమ్మ, నాగదేవత, ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్న సమయంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గొల్ల బజార్​లోని యాదవుల కుల దేవాలయం నుంచి సాంప్రదాయబద్ధంగా కటారీ విన్యాసాల మధ్య మకరతోరణాన్ని దురాజ్ పల్లి గుట్టకు తరలించారు. పెద్దగట్టు జాతర సందర్భంగా తొలి రోజు భారీగా దుకాణాలు వెలిశాయి. ఎగ్జిబిషన్ ప్రారంభంకాకపోవడంతో దేవుడి దర్శించుకున్న భక్తులు దుకాణాల్లో పలు వస్తువులను కొనుగోలు చేశారు. 

పోలీస్ సహాయ కేంద్రం ఏర్పాటు..

జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మర్రిచెట్టు సమీపంలో పోలీస్ సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం నుంచి మైక్ సాయంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలతో సహా ఏ వాహనాన్ని లోపలికి అనుమతించకుండా చర్యలు చేపట్టారు. గుట్ట చుట్టూ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నేడు సెలవు..

పెద్దగట్టు జాతర సందర్భంగా సూర్యాపేట, చివ్వెంల మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు. జాతర నేపథ్యంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు నేడు, రేపు సెలవులు ప్రకటించారు. రైతులెవరూ ధాన్యాన్ని తీసుకురావొద్దని సూచించారు.