హరహర మహదేవ.. శంభో శంకర నినాదాలతో మారుమోగిన శివాలయాలు

హరహర మహదేవ.. శంభో శంకర నినాదాలతో మారుమోగిన శివాలయాలు

నెట్‌‌వర్క్‌‌, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాలు హరహర మహాదేవ .. శంభో శంకర నినాదాలతో మారుమోగాయి. మహాదేవుడికి అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. శివాలయాలన్నీ భక్తులతో కిటకిలాడాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలయినా వేములవాడ, శ్రీశైలం,  కొమురవెల్లి, రామప్ప, కాళేశ్వరం, ఏడుపాయల, బాసర జనసంద్రంగా మారాయి. 

 వేములవాడ రాజన్నను దర్శిచుకునేందుకు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌‌గఢ్‌‌ నుంచి తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా గత రాత్రి నుంచే ఆలయంలో లఘు దర్శనం అమలుచేశారు. మూడు లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అద్దాల మండపంలో అనువంశిక అర్చకులు మహాలింగార్చనను నిర్వహించారు. 

రాత్రి 11-.35 గంటలకు లింగోద్భవ సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. గుడిచెరువు మైదానంలో ఏర్పాటు చేసిన ‘శివార్చన’లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌‌, ఎమ్మెల్సీ కవిత, కరీంనగర్‌‌‌‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌‌‌ ప్రత్యేక పూజలు చేశారు. 

కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సావాల్లో భాగంగా బుధవారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి నిరంతర రుద్రాభిషేకాలు, రాత్రి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. లింగోద్భవ కాలం తర్వాత తోట బావి వద్ద  పెద్దపట్నానికి ఏర్పాట్లు చేశారు. 

మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయం వద్ద మహాశివరాత్రి జాతర వైభవంగా ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వన దుర్గాభవానీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు మంజీరా నదీ పాయల్లో స్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  

ఖమ్మం జిల్లాలోని వైరా మండలం స్నానాలలక్ష్మీపురం, మధిర మృత్యుంజయస్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం రూరల్‌‌ మండలం తీర్థాల జాతరకు భద్రాది కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్‌‌ జిల్లాల నుంచి సుమారు లక్ష మంది భక్తులు వచ్చారు. 

ఉమ్మడి వరంగల్‌‌లోని రామప్ప టెంపుల్‌‌లో ఉదయం నుంచే భక్తులు రామలింగేశ్వర స్వామికి అభిషేకం చేశారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం, వేయి స్తంభాల గుడికి భక్తులు పోటెత్తారు. కాళేశ్వరంలో స్వామి వారికి కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేయి స్తంభాల గుడికి భక్తులు భారీ సంఖ్యలో రావడంతో రోడ్డు మీది వరకు క్యూలో నిల్చున్నారు.

మంచిర్యాల జిల్లా జైపూర్‌‌ మండలం వేలాలగట్టు మల్లికార్జునస్వామి జాతరకు ఎమ్మెల్యే వివేక్‌‌ వెంకటస్వామి దంపతులు, ఎంపీ వంశీకృష్ణ హాజరై పూజలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌‌ జిల్లాలో శైవక్షేత్రాల్లో భక్తులు శివుడికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రి సందర్భంగా బాసర వద్ద  గోదావరిలో లక్షలాది మంది పుణ్యస్నానాలు చేశారు. 

కరీంనగర్ పాతబజార్ గౌరీశంకర శివాలయం, అలుగునూర్ శ్రీరాజరాజేశ్వరి క్షేత్రం, ఎల్ఎండి కాలనిలోని మృత్యుంజయ మహా దేవాలయాల్లో స్వామివారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకున్నారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో బుధవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. నల్లమలలోని బౌరాపూర్ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో  చెంచుల సంప్రదాయ పద్ధతిలో కల్యాణాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు హాజరయ్యారు. 

రాజన్న ఆలయ గేట్‌‌కు తాళం

వేములవాడ, వెలుగు : శివరాత్రి రోజున వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ మెయిన్‌‌ గేట్‌‌ మూసివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మెయిన్‌‌ గేట్‌‌ మూసే ఉండడంతో వేలాది మంది భక్తులు ఆలయం బయటే ఉండిపోయారు. భక్తులు రాకుండా ఆలయం చుట్టూ బారీకేడ్లు ఏర్పాటు చేయడంతో మధ్యాహ్నం వరకు ఆలయం భక్తులు లేక వెలవెలబోయింది. 

విషయాన్ని ఆలయ ట్రస్ట్‌‌ బోర్డు సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, విప్‌‌ ఆది శ్రీనివాస్‌‌ దృష్టికి తీసుకెళ్లగా వారు పోలీసులకు చెప్పడంతో మెయిన్‌‌ గేట్‌‌ను ఓపెన్‌‌ చేసి భక్తులకు అనుమతి ఇచ్చారు. కానీ కొద్దిసేపటికే తిరిగి భక్తుల ప్రవేశాన్ని ఆపేశారు. భక్తులు రోడ్డుపైనే కొబ్బరికాయలు కొట్టి ఆఫీసర్లు, పోలీసుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు.