కేస్లాపూర్‌‌‌‌కు పోటెత్తిన భక్తులు..కిక్కిరిసిన ఆలయ పరిసరాలు

కేస్లాపూర్‌‌‌‌కు పోటెత్తిన భక్తులు..కిక్కిరిసిన ఆలయ పరిసరాలు
  • నాగోబాను దర్శించుకున్న మంత్రి సీతక్క, ఎంపీ, ఎమ్మెల్యేలు
  • ప్రజాదర్బార్‌‌‌‌కు హాజరైన కలెక్టర్‌‌‌‌, ఇతర ఆఫీసర్లు
  • జాతరలో భాగంగా నేడు బేతాల్ పూజలు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలోని కేస్లాపూర్‌‌‌‌లో జరుగుతున్న నాగోబా జాతరకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్కూళ్లకు సెలవు ప్రకటించడం, ప్రజాదర్బార్‌‌‌‌ నిర్వహణతో భక్తుల సంఖ్య పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు కంపార్ట్‌‌‌‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా, మధ్యాహ్నం తర్వాత భక్తుల భారీగా పెరగడంతో నాలుగు కంపార్ట్‌‌‌‌మెంట్లు నిండిపోయాయి.

నాగోబా దర్శనం కోసం గంటకు పైగా పట్టింది. రద్దీ కారణంగా ఆలయ పరిసరాలు కిటకిటలాడగా, కిలోమీటర్‌‌‌‌ మేర రోడ్లన్నీ భక్తులన్నీ నిండిపోయాయి. ఉదయం కలెక్టర్‌‌‌‌ రాజర్షిషా, ఎస్పీ గౌస్‌‌‌‌ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ప్రత్యేక పూజలు చేయగా, మధ్యాహ్నం ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌‌‌‌, ఇతర లీడర్లు నాగోబాను దర్శించుకున్నారు.

అనంతరం మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, కాంగ్రెస్ నాయకులు సత్తు మల్లేశ్, ఆత్రం సుగుణ, సోయం బాపురావు, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్‌‌‌‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తదితరులు వచ్చి దర్శనం చేసుకున్నారు. నాగోబా జాతరలో భాగంగా శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌‌‌‌లో 448 మంది అర్జీలు అందజేశారు. గ్రీవెన్స్‌‌‌‌లో వచ్చిన అర్జీలపై ఐటీడీఏ పీవోతో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌‌‌‌ రాజర్షి షా చెప్పారు. 


ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవి : మంత్రి సీతక్క 

ప్రకృతిని ఆరాదించే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని మంత్రి సీతక్క చెప్పారు. శుక్రవారం నాగోబాను దర్శించుకున్న అనంతరం ఆమె ఆదివాసీలను కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌‌‌‌ కారణంగా అధికారికంగా నిర్వహించిన దర్బార్‌‌‌‌ ముగిసిన తర్వాత ఆఫీసర్లు సభ నుంచి వెళ్లిపోవడంతో తర్వాత అదే సభలో మంత్రి సీతక్క మాట్లాడారు. ఆదివాసీల ఆచార వ్యవహారాలు, భాషలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

ఆదివాసీలకు ఇండ్లు, రోడ్లు, బోర్లు, విద్యుత్, ఉద్యోగాలు, పోడు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. జిల్లాలో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆమె వెంట ఖానాపూర్‌‌‌‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జీసీసీ కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ కోట్నాక్‌‌‌‌ తిరుపతి, డీసీసీబీ చైర్మన్‌‌‌‌ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశ్‌‌‌‌, పార్లమెంట్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జి ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జులు కంది శ్రీనివాస్‌‌‌‌రెడ్డి,ఆడె గజేందర్ పాల్గొన్నారు.