
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని దురాజ్‌పల్లిలో లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతర మూడో రోజు మంగళవారం జన సంద్రమైంది. అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు లింగమంతులస్వామికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయంగా చంద్రపట్నం వేసి.. యాచకులు, రాజులు, పూజారులు గుడి ఆవరణలో భేరీ చప్పుళ్లు, గజ్జెల మోతలతో యాదవుల కథలను చెబుతూ భైరవునికి పోలు రాయగా భక్తులు వీక్షించారు.
మున్నా వంశస్తులు మాణిక్యమ్మ తరపున.. మెంతబోయిన వంశస్తులు దేవర పెట్టెలోని లింగమంతుల స్వామి, మాణిక్యమ్మ కళ్యాణం జరిపించారు. అనంతరం మెంతబోయిన, గొర్ల వంశస్తులు తిరిగి కేసారానికి వెళ్లిపోయారు. మహిళలు గంపలను తలపై ఉంచుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొందరు తలపై దీపం పెట్టుకుని ఓ లింగా.. ఓ లింగా.. అంటూ స్వామిని స్మరిస్తూ దర్శించుకోగా.. మూడో రోజు కూడా యాదవ భక్తులు యాటలను బలిచ్చారు.
పెద్దగట్టు జాతరలో భాగంగా నాలుగో రోజు బుధవారం నెలవారం చేస్తారు. కొత్త మట్టి బోనం కుండల్లో పాలు పొంగించి స్వామికి పూజలు నిర్వహిస్తారు. సౌడమ్మ తల్లికి యాదవులు మొక్కులు చెల్లిస్తారు. సాయంత్రం చంద్రపట్నాన్ని కండ్లకు అద్దుకుని గుట్టపై ఉన్న పుట్టలో పోస్తారు. అనంతరం దేవరపెట్టెను భేరీ చప్పుళ్లు, కటారి విన్యాసాలతో వైభవంగా ఊరేగింపుగా కేసారానికి తరలిస్తారు.