భద్రాచలం,వెలుగు : కార్తీక మాసం సోమవారం వేళ భక్తులు భద్రాద్రిలో గోదావరి స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో శివయ్యకు పంచామృతాలతో అభిషేకం, బిళ్వపత్రాలతో అర్చన, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించారు.
సీతారామచంద్రస్వామికి ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి ముత్తంగి సేవను చేసి ప్రత్యేక హారతులు సమర్పించారు. బేడా మండపంలో నిత్య కల్యాణం జరిగింది. కంకణాలు ధరించిన భక్తులు క్రతువులో పాల్గొన్నారు. సాయంత్రం దర్బారు సేవ అనంతరం గోదావరికి నదీ హారతులను అందజేశారు. భక్తుల జయజయధ్వానాల మధ్య గోదావరి తీరంలో రాత్రి జరిగిన ఈ వేడుక వేదోక్తంగా సాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగించారు.