యాదగిరిగుట్ట, కొమురవెల్లి ఆలయాల్లో భక్తుల కోలాహలం

యాదగిరిగుట్ట, కొమురవెల్లి ఆలయాల్లో భక్తుల కోలాహలం
  • యాదగిరిగుట్ట, కొమురవెల్లి ఆలయాలకు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
  • పాతగుట్టలో నేత్రపర్వంగా ఎదుర్కోలు, నేడు నారసింహుడి కల్యాణం
  • మల్లన్న నామస్మరణతో మారుమ్రోగిన కొమురవెల్లి

యాదగిరిగుట్ట/కొమురవెల్లి, వెలుగు : యాదగిరిగుట్ట నర్సన్న, కొమురవెల్లి మల్లన్న ఆలయాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. సెలవు రోజు కావడంతో హైదరాబాద్‌‌‌‌ సహా పలు జిల్లాల నుంచి భక్తులు యాదగిరిగుట్టకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ కారణంగా లక్ష్మీపుష్కరిణి, వ్రత మండపాలు, కల్యాణకట్ట, అన్నదాన సత్రం, పార్కింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌, బస్‌‌‌‌బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి.

నారసింహుడి దర్శనానికి ధర్మదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి అరగంట టైం పట్టించని భక్తులు తెలిపారు. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.49 లక్షల ఆదాయం వచ్చింది. 

నేత్రపర్వంగా పాతగుట్ట నారసింహుడి ఎదుర్కోలు

యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. ప్రధానార్చకులు నల్లంతీగల్‌‌‌‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో సాయంత్రం నిత్యారాధనలు ముగిసిన తర్వాత స్వామివారిని అశ్వవాహనంపై ఊరేగించారు. అనంతరం రాత్రి 7 గంటలకు కల్యాణ మండపంలో ఎదుర్కోలు జరిపారు.

స్వామివారి తరఫున ఈవో భాస్కర్‌‌‌‌రావు, అమ్మవారి తరఫున ఆలయ చైర్మన్‌‌‌‌ నరసింహమూర్తి వ్యవహరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో భాస్కర్‌‌‌‌శర్మ, ఏఈవో జూషెట్టి కృష్ణగౌడ్‌‌‌‌ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు స్వామివారి కల్యాణం జరపనున్నారు. ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజవాహనంపై ఊరేగించిన అనంతరం తిరు కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్థం అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసిన ఆఫీసర్లు, ఎల్‌‌‌‌ఈడీ స్క్రీన్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. 

కొమురవెల్లిలో నాలుగో ఆదివారం సందర్భంగా...

కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతరలో భాగంగా నాలుగో ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. ఆదివారం ఒక్క రోజే సుమారు 60 వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని ఆఫీసర్లు తెలిపారు. రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి సుమారు ఆరు గంటల టైం పట్టింది. ముందుగా గంగిరేగు చెట్టు, ముఖ మంటపం వద్ద భక్తులు పట్నాలు వేసి బోనాలు సమర్పించారు.

అనంతరం గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మలతో కొలువైన మల్లన్నను దర్శించుకున్నారు. అలాగే మహిళలు బోనాలతో మల్లన్న గుట్టపైకి చేరుకొని ఎల్లమ్మ తల్లి సన్నిధికి సమర్పించారు. భక్తుల రద్దీ కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు