కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారం సాయత్రం క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం నిద్రలేచి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. దర్శనానికి గంటల సమయం పట్టింది. అనంతరం గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు.

కోడెల స్తంభం వద్ద స్వామి వారికి కోడెలను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మల్లన్న గుట్టపైన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్లి బోనాలు సమర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. కాగా మల్లికార్జునస్వామికి హైదరాబాద్ కు చెందిన భక్తుడు 11 రకాల పూల దండలతో చేసిన అలంకరణ అందరిని ఆకట్టుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  ఆలయ అధికారులు, సిబ్బంది  ఏర్పాట్లను పర్యవేక్షించారు.