యాదగిరిగుట్ట, వెలుగు: కార్తీకమాసం చివరివారం, అందులోనూ ఆదివారం కావడంతో.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి, శివకేశవులకు రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన పూజలు చేసి, సత్యనారాయణస్వామి వ్రతాలు జరిపించి మొక్కులు చెల్లించారు. రద్దీ కారణంగా నారసింహుడి ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది.
1594 మంది జంటల వ్రతాలు
శివాలయం, లక్ష్మీపుష్కరిణి, వ్రత మండపాల్లో భక్తులు కిక్కిరిసిపోయారు. దీపారాధన స్టాళ్లలో దీపాలు వెలిగించడంతో పాటు అనుబంధ ఆలయమైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శివకేశవులకు రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన చేశారు. ఆదివారం ఒక్కరోజే 1,594 మంది దంపతులు వ్రతాలు చేశారు. వ్రతాల నిర్వహణ ద్వారా ఆదివారం రూ.12,75,200 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు. వివిధ రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా రూ.1,09,40,868 ఆదాయం వచ్చిందన్నారు.
శాస్త్రోక్తంగా ‘స్వాతి’ పూజలు
ఆదివారం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతినక్షత్రం కావడంతో.. ప్రధానాలయంలో అర్చకులు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మంటపంలో 108 కలశాలను వరుస క్రమంలో పేర్చి స్వచ్ఛజలంతో మంత్రచ్ఛారణ చేశారు. ఆ జలంతో ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. ఈ పూజల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు.