భద్రాచలం ఉత్సవాలకు సర్కారు సాయమేది?

  • రూ.5 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి దేవస్థానం ప్రతిపాదన 

భద్రాచలం, వెలుగు : దక్షిణ అయోధ్య భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఉత్సవాల నిర్వహణ రోజురోజుకూ భారంగా మారుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామికి జరిగే ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వారికి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు ఉత్సవాలు కూడా అతిపెద్దవే. ఉత్సవాలు చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఏర్పాట్లు చేయాలంటే దేవస్థానానికి తలకు మించిన భారమవుతోంది. 

రూ.5కోట్లు కావాలి!

ముక్కోటి ఏకాదశీ వైకుంఠ ద్వార దర్శనం, తెప్పోత్సవంతో పాటు, శ్రీరామనవమి సీతారాముల కల్యాణం నిర్వహణకు ఏటా రూ.5కోట్లకు పైగా ఖర్చు అవుతోంది. లక్షలాది మంది భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలంటే రూ.5కోట్లు కావాలంటూ శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం నెల రోజుల కింద  ప్రతిపాదనలు తయారు చేసి పంపించింది. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాత్కాలిక వసతి, తాగునీరు, భోజన వసతితో పాటు ఉత్సవాలు చూసేలా ఎల్​ఈడీ స్క్రీన్​లు  ఏర్పాటు చేయాలి.  

ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, ప్రసాదాలు, గోదావరి తీరంలో భక్తులు దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు  తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏటా ఖర్చులకు నిధులు ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. తానీషా సంప్రదాయం ప్రకారం ఏటా శ్రీరామనవమి సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం తరుఫున తీసుకురావాలి. ఈ ఖర్చు దేవస్థానమే భరిస్తుంది. ఈ లాంఛనానికి రూ.1లక్ష ఇవ్వాలని గతంలోనే ప్రతిపాదనలు పంపించారు. అది అమలుకు నోచుకోలేదు. ఇప్పటికైనా సర్కారు స్పందిస్తే దేవస్థానానికి  ఊరట లభిస్తుంది.

గోదావరి వద్ద కనిపించని స్విమ్మర్లు, హెచ్చరిక బోర్డులు

భద్రాచలం వద్ద గోదావరిలో ఎలాంటి రక్షణ చర్యలు లేవు. భక్తులకు అవగాహన లేక అంచనాలు వేయలేక లోతుకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు గోదావరి స్నానం చేసి తర్వాత ఆలయానికి వెళ్తారు. దీనికి తోడు పవిత్ర గోదావరిలో పితృదేవతలకు పిండప్రదానాలు చేసేందుకు  వస్తుంటారు. వేసవి కాలం కావడంతో భద్రాచలం వచ్చిన భక్తులు గోదావరిలో సరదాగా స్నానం చేసేందుకు ఉత్సాహం చూపుతుంటారు.కానీ వారికి జాగ్రత్తలు చెప్పే వారే కరువయ్యారు.

దీంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ఏటా పది మంది భక్తులు భద్రాచలం వద్ద గోదావరిలో గల్లంతై ప్రాణాలు కోల్పోతున్నారు. గోదావరి ఒడ్డున భక్తుల రక్షణ దృష్ట్యా స్విమ్మర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. స్విమ్మర్లను కేవలం వర్షాకాలంలో గోదావరి వరదల సమయంలో మాత్రమే నియమిస్తున్నారు. గోదావరి లోతును తెలిపే బోర్డులు పెట్టడంతో పాటు, భక్తులు లోపలికి వెళ్లకుండా బారికేడ్స్​  పెట్టాల్సి ఉంది. పర్ణశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భద్రాచలం, పర్ణశాల రామాలయాల వద్ద గోదావరిలో పడవ ప్రయాణాలు చేసే పర్యాటకులకు కూడా ఎలాంటి రక్షణ చర్యలు లేవు.

పడవల్లో లైఫ్​ జాకెట్లు ఉండవు. ఆయిల్​ ఇంజన్లతో నడిపే ఈ బోట్లలో లెక్కకు మించి భక్తులను ఎక్కిస్తున్నారు. ఇక్కడ పర్యవేక్షించడానికి ఇరిగేషన్​ ఆఫీసర్లు ఎవరూ ఉండరు. గతంలో పర్ణశాలలో బోటులో నుంచి పడి ఇద్దరు భక్తులు చనిపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా భద్రాచలం, పర్ణశాల గోదావరి తీరంలో భక్తుల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

నివేదిక పంపాం... 

ఉత్సవాల నిర్వహణకు అయ్యే ఖర్చు వివరాలతో కూడిన నివేదికను ఎండోమెంట్ కమిషనర్​కు పంపించాం. భక్తులకు సదుపాయాలు కల్పిస్తాం. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. .

ఎల్​.రమాదేవి, ఈవో, శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం, భద్రాచలం